Friday, 23 September 2016

నీళ్ళు నీళ్ళు నీళ్ళు...

మధ్యాహ్నం మూడున్నర తర్వాత
నడుం వాల్చి 
'గాజు నది' చదువుతూనే 
నిద్రలోకి జారి పోయాను.

చూస్తుండగానే
నా శరీరం అమాంతం పెరిగి పెరిగి
మేఘమండలాన్ని ఢీ కొట్టింది
అభ్రమాలు చీలి జడివాన మొదలయ్యింది
సిరలు, ధమనులు నీటిని చిమ్ముతున్నాయి
నా గుండె 
ఓ చెరువయింది.

నా కాళ్ళు, చేతులు కాలువలయినయి
మొండం నుంచి నీరు ఉబికివస్తుంది
నీళ్ళు నీళ్ళు నీళ్ళు 
ఎక్కడ చూసినా నీళ్ళు 
పాతాళం పగిలిందా అన్నట్లు.

క్షణాల్లో ఆ ప్రాంతమంతా 
నేల ఈనినట్టు 
నీళ్ళు నీళ్ళు నీళ్ళు 

దూరంగా హెలికాప్టర్లు
చక్కర్లు కొడుతూ భవనాల పైనున్న
జనాలను రక్షిస్తున్నాయి...

ఎవరో అంటున్నారు 
చెరువును చెరువే ఆక్రమించుకున్నదని...

'ఏమండీ భారీ వర్షం వస్తుంది 
మీ మొద్దు నిద్ర ఆపుతారా ?
ఏమిటా అరుపులు?'
దిగాంతంలోంచి విడబడుతంది
మా ఆవిడ కంఠం

పక్కన 'గాజు నది' నవ్వుతూ 

బయట ఉరుముతున్న 
దట్టమైన నల్లని మేఘాలు 
పచ్చని ఆకులను తాకుతూ
ఎగురుతున్న తెల్లని కొంగలు
గాలి వాన మొదలయ్యింది.

ఎంత అందమైన కల !

కాస్తా 
ఆ చెరువుల కాలనీ వాసులకు
ఈ వార్త చేరవేయండి 
జడివాన తరుముకస్తందని...

తేది : 04.05.2016.

No comments:

Post a Comment