Friday, 23 September 2016

చీకటి చుక్కల కౌగిలింత

నాలుగు వైపులా 
చీకటి నిద్రిస్తున్న సమయాన 
మెలకువ 
మదిలోని ఊహలన్నీ 
కాంతి పుంజాలై మేల్కొని 
అక్షరాల రూపుకట్టి పహారా కాస్తుంటాయి.

ఏమి కనిపించని 
ఆ నిశీధి వాకిటిలోంచి 
కొత్త దారుల చిరునామాలు
కంటి చుట్టూ 
లిప్తపాటు తలుక్కున మెరిసి
అలసిన మనసును నిద్రపుచ్చుతుంటాయి.

ఎవరి చుట్టూ 
ఏమీ మిగలదనేది నిజమే 
అయినా 
ఏదో మిగుల్చుకోవాలనే ఆశ
నిదురను దగ్గర చేరనీయదు.

కారణం ఇదమిద్దంగా తెలియదు
కానీ 
ఇచ్చిన మాటను 
ఎక్కడో విసిరేసి
శూన్యత నింపిన గాలి బుడగను
రాత్రికి 
బహుమతిస్తాము.

పగలూ రాత్రీ 
వ్యతిరేక దిశలో పయనించడం
సహజమే 
కానీ
వెలుతురు మెతుకుల్లోని బతుకుకు
చీకటి చుక్కల కౌగిలింత కొత్తే కదా.

వెలుగు జాతర 
పక్షుల కువకువలు
వినబడే దాకా నిఘా నీడ కోలాహలమే.


No comments:

Post a Comment